Thursday 29 April 2010

నేటి సినిమా...

చాలా కాలం గా నన్ను వేధిస్తున్న సమస్యలలో నేటి సినిమా నాణ్యత ఒకటి. ఎప్పుడు చూసినా, మా తాతలు నేతులు తాగారు లాగ, పాత సినిమాలన్నీ గొప్పవి, ఆ రోజుల్లో వాళ్ళు మహానుభావులు అన్న రీతిలో మూస మాటలు, నేడు పేరెన్నిక గన్న మహానుభావులనించి, కళారంగం లో బొడ్డూడని బాబుల దాక అందరూ ఒకటే వగచడం.

నేను చూసినంత వరకు, కథలో బలం, కొత్తదనం, వగైరా లు ఉన్నన్ని సినిమాలు, ఎప్పుడు రిలీజ్ అయినా, పది కాలాలపాటు నిలబడుతున్నాయి. నిన్న మొన్న వచ్చిన అతడు కాని, అంతకంటే తరవాత సినిమాలు కాని, అంతకుముందు వచ్చిన ఎన్నో గొప్ప సినిమాలు, ఇవాళ మళ్ళీ చూసినా మనసుని రంజింప చేస్తున్నాయి కదా. అటువంటప్పుడు, ఇవ్వాళ మంచి కళాకారులు లేరని ఎలా అనుకుంటాము. అదే తనికెళ్ళ భరణి గారు, శ్రీరాం గారు, ఇంకా నాలాంటి మందమతులకి పేర్లు గుర్తుకురాని ఎందఱో మహానుభావులు, అలాగే, పాటల రచన లో ఉద్దండులు, దర్శకులలో పేరెన్నిక గన్నవారు అందరూ వారే, ఇవ్వాళ రంగములో కాలూని నిలబడిన వారే.

అంచేత లోపము మనుషులలో లేదు. మరెక్కడో ఉంది. తెలుగు లో ఒక ముతక సామెత ఉంది, మొహమాటానికి పోతే కడుపు ఒచ్చిందని. అలాగ ఇవ్వాళ సినిమాల నాణ్యత దెబ్బ తినడానికి కారణాలు వేరే. నాదృష్టిలో ఒక రచన చేసే వ్యక్తి అనుభవాలు, ఆలోచనా సరళి, స్థాయి, భావ వ్యక్తీకరణ లో సౌమ్యత, ఇటువంటివి రచనలో ప్రస్ఫుటం గా కనపడతాయి. ఉదాహరణకి ఒక మనిషి చిత్రహింస పడ్డాడు అని వ్రాయడానికి, ఎలా, ఎన్ని రకాలు గా హింసించ బడ్డాడో వ్రాయడం అనేది, ఆ రచయిత(త్రి) మానసిక పరిపక్వతని చూపిస్తుంది. అలాగే, సినిమా లాంటి కళాత్మక మాధ్యమంలో కూడా, ఆయా వ్యక్తుల నైజం కనబడుతుంది. అటువంటి వారు తీసే సినిమాలు నిలబడకుండా పోవాలి అంటే, మిగిలిన వారు తీసే సినిమాలు చాలా రావాలి. అప్పుడు చెత్త తేలిపోతుంది. ఎనభై దశకం అంతకంటె ముందు, ఊక దంపుడు, అశ్లీలత ఉన్న సినిమాలు, కొన్ని హాళ్ళలో, కొండొకచో ఉదయపు ఆటల ప్రత్యేకతలో ప్రదర్శింప బడేవి. తప్పి జారి వేరే టైములో ఆ సినిమా ప్రదర్శింప బడినా, టిక్కట్లు అమ్ముడు పోయేవి కాదు. ఎప్పుడైనా చెరుకు తినడానికి చాలా ఉన్నప్పుడు చొప్ప ఎవరు నములుతారు? నమలటానికి అలవాటు పడిపోయినవారు ఏదో ఒకటి అని దొరికిన గడ్డి తింటారు. అంత మాత్రం చేత, మంచి వస్తువ ఉంటే కూడా అది మానేసి చెత్త వైపు వెళ్ళరు. అంచేత, పరిస్థితి మారాలి అంటే, మంచి సినిమాలు తియ్యగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ చెత్తని తగ్గించాలి. నేను పైన పేర్కొన్న వాళ్ళు కూడా రంగములో నిష్ణాతులు, ఊకదంపుడు గాళ్ళని అడ్డుకునికూడా నిభాయించ గల వారు (అని నా నమ్మకం) కనక, మొదటి అడుగు వాళ్ళు వేస్తె, మిగతా వారందరూ అటే నడవక తప్పదు.

ఒకవేళ ఎవరైనా కలిసి రాకపోతే కొమ్ములు వంచడానికి ప్రత్యేకం గా అసోసియేషన్ ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు కదా!!

అప్పుడు మన భావి తరం కూడా, మా చిన్నప్పుడు అని చెప్పుకునే అవకాశం వస్తుంది.

భవదీయుడు

సీతారామం

Thursday 8 April 2010

కుహనా హేతువాదమా?

భవానీ శంకర్ గారు ఆంధ్ర భూమి లో వ్రాసిన 'శాస్త్రీయ దృక్పథం కాదు... కుహనా హేతువాదం' అన్న వ్యాసము దీనికి ప్రేరణ.

స్థూలము గా భవానీ శంకర్ గారి వాదన ఏమిటి అంటే, ఒకరు ఇద్దరు దొంగ బాబా లు బయట పడినంత అందరినీ అదే గాట కట్ట కూడదు అని. శాస్త్రీయ విధానాలకు అంతు పట్టనివి ఎన్నో ఉన్నాయి అని, సైన్సు వల్ల జరిగే నష్టాలను హేతువాదులు మరుగు పరచకూడదని, పూజలు, మంత్రాలు, జ్యోతిష్యము వంటి వాటి వల్ల జరిగే లాభాలను ఒప్పుకోవాలని అన్నారు.

వీటిలో, పూజలు, మంత్రాలు, జ్యోతిష్యము వంటి వాటిని పూర్తి నిర్దేశిత విధానాలలో చూస్తే వాటి వల్ల లాభాలు ఉన్నాయేమో గాని, మిడి మిడి జ్ఞానము తో గుడ్డి గా నమ్మడము హేతువు కి అందదు కనక, వాటి వల్ల ప్రయోజనాలు స్వల్పము, స్వార్థపరులకు లాభ దాయకము. అందుచేత, పూర్తిగా నిర్ధారణ అయితే తప్ప, కుహనా జ్ఞానుల అండ కోరుకోవడం వృథా.

ఆ వ్యాసము లో ఉదాహరించిన కోకురో ఉదంతము నాకు తెలియదు. కానీ, ఆయన చెప్పిన దానిని యథాతథము గా ఒప్పుకుంటాను. అట్టి బౌద్ధభిక్షుకులను జనబాహుళ్యము వెదికి పాదములంటి నమస్కరించ వలసినదే. కాని, వారే ముందుకు వచ్చి మావల్లే ఇదంతా అని చాటింపు వేసుకుని పాద పూజలు ఆశిస్తే? అది వారికి యెంత గౌరవము? ఎన్నడూ నిజమైన సాధుజనులు వారంత వారై ప్రాప్తము లేనట్టి వారికి కనిపించరు. కనపడే ధూర్తులంతా పగటి వేషగాళ్ళు. ఇటువంటి వారిని ప్రోత్సహించడము, నిప్పుని చేతితో పట్టుకోవడము లాంటిది. భగవదారాధన మానివేసి, వ్యక్తి ఆరాధన లో జనులు మునిగి పోవడము ఎంత వరకు శ్రేయస్కరము?

కుహనా హేతువాదాన్ని ఖండించిన కలము కుహనా స్వాములను ఎందుకు ఖండించదు? కృష్ణ శాస్త్రి గారు వ్రాసినట్లు, ఎరిగిన వారికి యెదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు, అట్టి భగవంతుని సన్నిధికి చేర్చడానికి బోయీల అవసరం ఏమిటి?

నీలతోయద మధ్యస్థా ద్యిద్యుల్లెఖేవ భాస్వరా
నీవార శూక వత్తన్వీ పీతాభాస్వత్యణూపమా అని వేదోక్తి.

అట్టి జ్యోతి మధ్య నున్న భగవంతుడు ప్రాప్తము ఉన్నవారికి తనకు తానై కనబడతాడు, అంతే కాని తుచ్ఛ మానవ సహాయము కోరడు.

అశాస్త్రీయాన్ని ఖండించండి. భారతీయ సంస్కృతిని కాపాడండి, జ్యోతిష శాస్త్ర విలువని పెంచండి, పూజల మహిమ చాటండి. అలాగే, కుహనా వేషగాళ్ళ భరతం పట్టండి. వారి మాటల గారడీ నమ్మకండి. మాజిక్ చూడాలంటె, పి.సి సోర్కార్ లాంటి వాళ్ళ షో చూడండి. అంతే కాని అన్య పురుష పాదాక్రాంతులు కాకండి, వారికి డబ్బు, జీవితము వెల పోయకండి

భవదీయుడు,

సీతారామం

Monday 5 April 2010

కొత్త ఒక వింతేనా?

చాలా సార్లు వినే పాత సామెత, కొత్త ఒక వింత, పాత ఒక రోత అని. కానీ, ఎప్పుడు చూసినా, కొత్త మార్పులని గమనించి ఇందులో కళాత్మకత లేదు, పాతదే చాలా నయము అని రెండు తరాలూ చూసిన వారందరూ అంటూ ఉంటారు. దీనికి ప్రేరణ, శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి బ్లాగ్ లో సరి కొత్త వ్యాసము.

మార్పు సహజము. చాలా సార్లు మార్పు సహించలేక పోవడమూ సహజము. ఇప్పుడు మనకేమీ తప్పుగా తోచని వ్యావహారిక భాషా ప్రయోగము, గిడుగు వారిని కొండక చో దోషిగా నిలబెట్టింది. విశ్వనాథ వారి వేయిపడగలు చదివారా అంటే, లేదని ఎగిరి గంతేసి తీసుకుని, అబ్బో ఇది గ్రాంధికము నాకు అర్థము కాదు అని వెనక్కిచ్చేసినవారు నాకు తెలుసు. ఇవ్వాళ కావ్య రచన చేసే మహానుభావులెక్కడున్నారో నాకు తెలియదు. ఛందోబద్ధమైన పద్యం రాయడమే గొప్ప లా చూడబడుతున్న ఈ రోజులలో నారికేళపాకాలు కోరుకోవడమూ అనవసరము, ఒకవేళ ఎవరైనా చాదస్తుడు (క్షమించాలి) వ్రాసినా, అది ఆత్మ తృప్తికే గాని, భుక్తికి పనికి రాదు. అంటే, ఒకప్పుడు, ప్రతిభకు గీటురాయి గా ఉన్న ప్రక్రియ, ఇవ్వాళ, పూర్తిగా మరణించకపోయినా, మరణశయ్య మీద ఉన్నట్టు నాకనిపిస్తోంది.

అలాగే, ఇవాళ ఏవిధముగా అయితే కావ్య రచన మరుగున పడిపోతోందో, శ్రావ్యమైన పాటలు తగ్గి పోతున్నాయో, అలాగే క్రీడలలో కూడా అయిదు రోజుల ఆట చరమాంకానికి చేరుకుంటోంది. పులి గడ్డి మేయనట్లు, 20/20 పద్ధతిలో ధాటిగా ఆడి టెస్ట్ క్రికెట్ లో 1000 పరుగులు చేసే దిశ లో ఆటగాళ్ళు జట్లు కదులుతున్నాయి. వారి నించి కళాత్మక క్రీడా విశేషాలు ఆశించడం అనవసరము. ఎప్పుడో బ్రాడ్మన్ ఆడినట్లు ఇవాళ ఆడరు, ఆడితే చూడరు.

ఇది తప్పదు, తప్పు కాదు. గొల్లపూడి గారు చివర గా వ్రాసినట్లు, తాత్కాలికమే శాశ్వతమవటల్లేదు, ఇదే భవిష్యత్తు. మిగతా వాటికి విచారించి సమాధి కట్టినట్లు, ఐదురోజుల ఆట, ఆటలో కళాత్మకత లకు ఎంత తొందర గా గోరీ కడితే, అంత ఆధునికవాదులవ్వచ్చు.

భవదీయుడు,

సీతారామం