Monday 5 July 2010

విశాఖ కి ఇంత అన్యాయమా...

మిత్రులారా,

నిజానికి నా బ్లాగ్ విమర్శనా ప్రధానమే అయినా, విశాఖ పట్టణానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించ వలసిన సమయం వచ్చింది.

విశాఖ రాష్ట్రంలోనే రెండవ పెద్ద పట్టణం. పేరెన్నికగన్న ఓడరేవు. విహార స్థలము. ఇన్ని ఉన్నా, నానాటికీ, ఆ ఊరు తిన్నగా వెళ్ళే రైళ్ళ సంఖ్య తగ్గి పోవడం చాలా బాధాకరం.

దయచేసి, మీరంతా, ఈ కింద ఇచ్చిన లింక్స్ లోంచి మీ అభ్యంతరాన్ని ఆ యా ప్రముఖులకి తెలియచేయండి.

మీ మిత్రుడు,

సీతారామం

శ్రీమతి ప్రతిభా పాటిల్

మమతా Benarjee (రైల్వే మంత్రి)

దగ్గుబాటి పురందరేశ్వరి ( విశాఖ)

సబ్బం హరి (అనకాపల్లి)

ఉండవల్లి అరుణ్ కుమార్ ( రాజమండ్రి)

బొత్స ఝాన్సీ (విజయనగరం)

కిల్లి కృపారాణి (శ్రీకాకుళం)

Saturday 26 June 2010

కూడలి

నా బ్లాగ్ కూడలి లో చేర్చబడింది...

సీతారాం

Thursday 24 June 2010

గంధం వారి కథా గంధం..

ముందుగా ఈ పోస్టు ఒక్కసారైనా శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ గారు చూడాలని, చూచి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను..

90 దశకంలో రచన పత్రిక క్రమం తప్పకుండా చదువుతున్న రోజులలో గంధం వారి 'సెలవయింది' అన్న కథా సంపుటం జ్యేష్ఠ వారనుకుంటాను, ప్రచురించారు. పట్టుబట్టి, మా నాన్నగారి వెంట పడి ఆ పుస్తకం కొని, చదివి, మళ్ళీ మళ్ళీ చదువుతూ ఆ కథలన్నీ కంఠతా పట్టేశాను.

ఒక్కో కథా ఒక్కో ముత్యము అంటే అతిశయోక్తి కాదు. ఆ పుస్తకానికి ముందుమాట లో శ్రీ వాకాటి పాండురంగారావు గారు నిత్యం మన జీవితం లో మన ఇళ్ళలో సాధారణం గా ఉండే వస్తువ లనీ, మనుషులు, ఊర్ల పేర్ల తో సహా, సహజాతి సహజము గా వ్రాయగల కథకులు అని పరిచయం చేస్తారు గంధం వారిని.

ఇవాళ ఇది వ్రాయడానికి కారణం ఈ వారం నవ్య లో పడ్డ ' మగాళ్ళకేంతెలుసు ' అన్న కథ. అది మళ్ళీ కదిపిన జ్ఞాపకాల తేనెపట్టు.

ముందు పేర్కొన్న పుస్తకం లో, నాకు అన్నీ నచ్చినవే. మచ్చుకి ఒక కథ ని మీకు పరిచయం చేస్తాను..

దాక్షిణ్య లోభం అన్న కథ లో, పెద్ద చదువు చదువుతున్న మేన బావ పెళ్ళికి చిన్న ఉద్యోగస్తుడైన మురారి వెడతాడు. అసలు తనకిష్టం లేక పోయినా, మేన మామ మాట కాదనలేక వెళ్లి అవమాన పడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంతకీ అవమానానికి కారణం, మురారి పెళ్లి వేద మంత్రాలతో జరగకపోవడం, దాన్ని మేనమామ భార్య పెళ్లి గా గుర్తించకపోవడం.

పోతే, అంత ధార్మికం గా పెళ్లి చేసుకున్న విద్యాధిక, సంపన్న పెళ్లి కొడుకూ, పెట్టు పోతలలో మాట పట్టింపు కి పోయి ఆ పెళ్లి కూతురుని అక్కడే విడిచి ఇంటికి వెళ్ళిపోతాడు.

ఈ విషయాలన్నీ, వారిని అదుపుచేయ అశక్తుడైన మేనమామ మురారికి లేఖ రూపేణా తెలియబరచి, ఆఖరున, 'నాయనా మురారీ, ఇంత జరిగీ ఇంకా నీ మేనమామ బతికే ఉన్నాడు' అంటాడు.

ఇది స్థూలంగా దాక్షిణ్య లోభం కథ. మామూలుగా మన మధ్యలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరీ పెళ్లి కూతురుని వదిలెయ్యక పోయినా, పెట్టు పోతలు జరగలేదనీ, తక్కువ చేశారనీ, ఇలా ఎన్నో చికాకులు వింటూ ఉంటాము. అందరూ ఒక్కసారి, మనకు వేరే వాళ్ళు ఇస్తే తీసుకునే ఖర్మ ఏమిటి అని ఆలోచిస్తే, ఇంక ఎవరూ ఎవరినీ ఏదీ అడగరు కదా...

ఈ పోస్టు చదివిన వారు అందరూ నా మాట మన్నించి ఆ పుస్తకం చదివి వారి భావాలు నాతొ పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఆ పుస్తకము దొరకని వారు కనీసం పైన పేర్కొన్న కథ చదవండి..

భవదీయుడు

సీతారామం

Thursday 17 June 2010

7 కోట్ల కధ

నాకు ఎందుకో సినిమా ని పేపర్ లో చదువుతున్నట్టు గా ఉంది. లేక పోతే ఒకానొక కారు లో డబ్బు దొరకడం, మహా మంత్రి గారి సైన్యపు మరకలు ఉండడం, దానికి దారిలో దొరికితే దాచామని ముసుగు, ఆహా హా

ఇంకో మలుపు, అసలుకి ఆడబ్బు మాది కాదు, వీరిది అని రెండు సాచ్చీకాలు, అవున్నిజమే, నాదగ్గర బళ్ళు కొనడానికే అంటూ మరో తోక సాక్షి.

వీటన్నిటికి మహా సైన్యాధికారి ముద్ర. ఒహోహో

ఎంత రక్తి కట్టింది కథ?

కే.జి. కందిపప్పు కూడా కార్డు మీద కొంటున్న, ఏదైనా వస్తువు విలువ లక్ష దాటితే చెక్కు వాడుతున్న ప్రజలు గొర్రెలు.. కాదనే గొర్రె (సారీ) ఎక్కడైనా ఉందా? కాబట్టి మనం పనిమాలా సినిమాలకి వెళ్లక్కరలేదు, ఇంటో కూచుని చదివి, ఆనక చెవులో తిరెట్టుగోచ్చు..

సీతారామం

P. S. ఏమీ రాయట్లేదేం అని జ్ఞాపకం చేసిన మాధురి కృష్ణ గారికి కృతఙ్ఞతలు.

Thursday 29 April 2010

నేటి సినిమా...

చాలా కాలం గా నన్ను వేధిస్తున్న సమస్యలలో నేటి సినిమా నాణ్యత ఒకటి. ఎప్పుడు చూసినా, మా తాతలు నేతులు తాగారు లాగ, పాత సినిమాలన్నీ గొప్పవి, ఆ రోజుల్లో వాళ్ళు మహానుభావులు అన్న రీతిలో మూస మాటలు, నేడు పేరెన్నిక గన్న మహానుభావులనించి, కళారంగం లో బొడ్డూడని బాబుల దాక అందరూ ఒకటే వగచడం.

నేను చూసినంత వరకు, కథలో బలం, కొత్తదనం, వగైరా లు ఉన్నన్ని సినిమాలు, ఎప్పుడు రిలీజ్ అయినా, పది కాలాలపాటు నిలబడుతున్నాయి. నిన్న మొన్న వచ్చిన అతడు కాని, అంతకంటే తరవాత సినిమాలు కాని, అంతకుముందు వచ్చిన ఎన్నో గొప్ప సినిమాలు, ఇవాళ మళ్ళీ చూసినా మనసుని రంజింప చేస్తున్నాయి కదా. అటువంటప్పుడు, ఇవ్వాళ మంచి కళాకారులు లేరని ఎలా అనుకుంటాము. అదే తనికెళ్ళ భరణి గారు, శ్రీరాం గారు, ఇంకా నాలాంటి మందమతులకి పేర్లు గుర్తుకురాని ఎందఱో మహానుభావులు, అలాగే, పాటల రచన లో ఉద్దండులు, దర్శకులలో పేరెన్నిక గన్నవారు అందరూ వారే, ఇవ్వాళ రంగములో కాలూని నిలబడిన వారే.

అంచేత లోపము మనుషులలో లేదు. మరెక్కడో ఉంది. తెలుగు లో ఒక ముతక సామెత ఉంది, మొహమాటానికి పోతే కడుపు ఒచ్చిందని. అలాగ ఇవ్వాళ సినిమాల నాణ్యత దెబ్బ తినడానికి కారణాలు వేరే. నాదృష్టిలో ఒక రచన చేసే వ్యక్తి అనుభవాలు, ఆలోచనా సరళి, స్థాయి, భావ వ్యక్తీకరణ లో సౌమ్యత, ఇటువంటివి రచనలో ప్రస్ఫుటం గా కనపడతాయి. ఉదాహరణకి ఒక మనిషి చిత్రహింస పడ్డాడు అని వ్రాయడానికి, ఎలా, ఎన్ని రకాలు గా హింసించ బడ్డాడో వ్రాయడం అనేది, ఆ రచయిత(త్రి) మానసిక పరిపక్వతని చూపిస్తుంది. అలాగే, సినిమా లాంటి కళాత్మక మాధ్యమంలో కూడా, ఆయా వ్యక్తుల నైజం కనబడుతుంది. అటువంటి వారు తీసే సినిమాలు నిలబడకుండా పోవాలి అంటే, మిగిలిన వారు తీసే సినిమాలు చాలా రావాలి. అప్పుడు చెత్త తేలిపోతుంది. ఎనభై దశకం అంతకంటె ముందు, ఊక దంపుడు, అశ్లీలత ఉన్న సినిమాలు, కొన్ని హాళ్ళలో, కొండొకచో ఉదయపు ఆటల ప్రత్యేకతలో ప్రదర్శింప బడేవి. తప్పి జారి వేరే టైములో ఆ సినిమా ప్రదర్శింప బడినా, టిక్కట్లు అమ్ముడు పోయేవి కాదు. ఎప్పుడైనా చెరుకు తినడానికి చాలా ఉన్నప్పుడు చొప్ప ఎవరు నములుతారు? నమలటానికి అలవాటు పడిపోయినవారు ఏదో ఒకటి అని దొరికిన గడ్డి తింటారు. అంత మాత్రం చేత, మంచి వస్తువ ఉంటే కూడా అది మానేసి చెత్త వైపు వెళ్ళరు. అంచేత, పరిస్థితి మారాలి అంటే, మంచి సినిమాలు తియ్యగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ చెత్తని తగ్గించాలి. నేను పైన పేర్కొన్న వాళ్ళు కూడా రంగములో నిష్ణాతులు, ఊకదంపుడు గాళ్ళని అడ్డుకునికూడా నిభాయించ గల వారు (అని నా నమ్మకం) కనక, మొదటి అడుగు వాళ్ళు వేస్తె, మిగతా వారందరూ అటే నడవక తప్పదు.

ఒకవేళ ఎవరైనా కలిసి రాకపోతే కొమ్ములు వంచడానికి ప్రత్యేకం గా అసోసియేషన్ ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు కదా!!

అప్పుడు మన భావి తరం కూడా, మా చిన్నప్పుడు అని చెప్పుకునే అవకాశం వస్తుంది.

భవదీయుడు

సీతారామం

Thursday 8 April 2010

కుహనా హేతువాదమా?

భవానీ శంకర్ గారు ఆంధ్ర భూమి లో వ్రాసిన 'శాస్త్రీయ దృక్పథం కాదు... కుహనా హేతువాదం' అన్న వ్యాసము దీనికి ప్రేరణ.

స్థూలము గా భవానీ శంకర్ గారి వాదన ఏమిటి అంటే, ఒకరు ఇద్దరు దొంగ బాబా లు బయట పడినంత అందరినీ అదే గాట కట్ట కూడదు అని. శాస్త్రీయ విధానాలకు అంతు పట్టనివి ఎన్నో ఉన్నాయి అని, సైన్సు వల్ల జరిగే నష్టాలను హేతువాదులు మరుగు పరచకూడదని, పూజలు, మంత్రాలు, జ్యోతిష్యము వంటి వాటి వల్ల జరిగే లాభాలను ఒప్పుకోవాలని అన్నారు.

వీటిలో, పూజలు, మంత్రాలు, జ్యోతిష్యము వంటి వాటిని పూర్తి నిర్దేశిత విధానాలలో చూస్తే వాటి వల్ల లాభాలు ఉన్నాయేమో గాని, మిడి మిడి జ్ఞానము తో గుడ్డి గా నమ్మడము హేతువు కి అందదు కనక, వాటి వల్ల ప్రయోజనాలు స్వల్పము, స్వార్థపరులకు లాభ దాయకము. అందుచేత, పూర్తిగా నిర్ధారణ అయితే తప్ప, కుహనా జ్ఞానుల అండ కోరుకోవడం వృథా.

ఆ వ్యాసము లో ఉదాహరించిన కోకురో ఉదంతము నాకు తెలియదు. కానీ, ఆయన చెప్పిన దానిని యథాతథము గా ఒప్పుకుంటాను. అట్టి బౌద్ధభిక్షుకులను జనబాహుళ్యము వెదికి పాదములంటి నమస్కరించ వలసినదే. కాని, వారే ముందుకు వచ్చి మావల్లే ఇదంతా అని చాటింపు వేసుకుని పాద పూజలు ఆశిస్తే? అది వారికి యెంత గౌరవము? ఎన్నడూ నిజమైన సాధుజనులు వారంత వారై ప్రాప్తము లేనట్టి వారికి కనిపించరు. కనపడే ధూర్తులంతా పగటి వేషగాళ్ళు. ఇటువంటి వారిని ప్రోత్సహించడము, నిప్పుని చేతితో పట్టుకోవడము లాంటిది. భగవదారాధన మానివేసి, వ్యక్తి ఆరాధన లో జనులు మునిగి పోవడము ఎంత వరకు శ్రేయస్కరము?

కుహనా హేతువాదాన్ని ఖండించిన కలము కుహనా స్వాములను ఎందుకు ఖండించదు? కృష్ణ శాస్త్రి గారు వ్రాసినట్లు, ఎరిగిన వారికి యెదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు, అట్టి భగవంతుని సన్నిధికి చేర్చడానికి బోయీల అవసరం ఏమిటి?

నీలతోయద మధ్యస్థా ద్యిద్యుల్లెఖేవ భాస్వరా
నీవార శూక వత్తన్వీ పీతాభాస్వత్యణూపమా అని వేదోక్తి.

అట్టి జ్యోతి మధ్య నున్న భగవంతుడు ప్రాప్తము ఉన్నవారికి తనకు తానై కనబడతాడు, అంతే కాని తుచ్ఛ మానవ సహాయము కోరడు.

అశాస్త్రీయాన్ని ఖండించండి. భారతీయ సంస్కృతిని కాపాడండి, జ్యోతిష శాస్త్ర విలువని పెంచండి, పూజల మహిమ చాటండి. అలాగే, కుహనా వేషగాళ్ళ భరతం పట్టండి. వారి మాటల గారడీ నమ్మకండి. మాజిక్ చూడాలంటె, పి.సి సోర్కార్ లాంటి వాళ్ళ షో చూడండి. అంతే కాని అన్య పురుష పాదాక్రాంతులు కాకండి, వారికి డబ్బు, జీవితము వెల పోయకండి

భవదీయుడు,

సీతారామం

Monday 5 April 2010

కొత్త ఒక వింతేనా?

చాలా సార్లు వినే పాత సామెత, కొత్త ఒక వింత, పాత ఒక రోత అని. కానీ, ఎప్పుడు చూసినా, కొత్త మార్పులని గమనించి ఇందులో కళాత్మకత లేదు, పాతదే చాలా నయము అని రెండు తరాలూ చూసిన వారందరూ అంటూ ఉంటారు. దీనికి ప్రేరణ, శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి బ్లాగ్ లో సరి కొత్త వ్యాసము.

మార్పు సహజము. చాలా సార్లు మార్పు సహించలేక పోవడమూ సహజము. ఇప్పుడు మనకేమీ తప్పుగా తోచని వ్యావహారిక భాషా ప్రయోగము, గిడుగు వారిని కొండక చో దోషిగా నిలబెట్టింది. విశ్వనాథ వారి వేయిపడగలు చదివారా అంటే, లేదని ఎగిరి గంతేసి తీసుకుని, అబ్బో ఇది గ్రాంధికము నాకు అర్థము కాదు అని వెనక్కిచ్చేసినవారు నాకు తెలుసు. ఇవ్వాళ కావ్య రచన చేసే మహానుభావులెక్కడున్నారో నాకు తెలియదు. ఛందోబద్ధమైన పద్యం రాయడమే గొప్ప లా చూడబడుతున్న ఈ రోజులలో నారికేళపాకాలు కోరుకోవడమూ అనవసరము, ఒకవేళ ఎవరైనా చాదస్తుడు (క్షమించాలి) వ్రాసినా, అది ఆత్మ తృప్తికే గాని, భుక్తికి పనికి రాదు. అంటే, ఒకప్పుడు, ప్రతిభకు గీటురాయి గా ఉన్న ప్రక్రియ, ఇవ్వాళ, పూర్తిగా మరణించకపోయినా, మరణశయ్య మీద ఉన్నట్టు నాకనిపిస్తోంది.

అలాగే, ఇవాళ ఏవిధముగా అయితే కావ్య రచన మరుగున పడిపోతోందో, శ్రావ్యమైన పాటలు తగ్గి పోతున్నాయో, అలాగే క్రీడలలో కూడా అయిదు రోజుల ఆట చరమాంకానికి చేరుకుంటోంది. పులి గడ్డి మేయనట్లు, 20/20 పద్ధతిలో ధాటిగా ఆడి టెస్ట్ క్రికెట్ లో 1000 పరుగులు చేసే దిశ లో ఆటగాళ్ళు జట్లు కదులుతున్నాయి. వారి నించి కళాత్మక క్రీడా విశేషాలు ఆశించడం అనవసరము. ఎప్పుడో బ్రాడ్మన్ ఆడినట్లు ఇవాళ ఆడరు, ఆడితే చూడరు.

ఇది తప్పదు, తప్పు కాదు. గొల్లపూడి గారు చివర గా వ్రాసినట్లు, తాత్కాలికమే శాశ్వతమవటల్లేదు, ఇదే భవిష్యత్తు. మిగతా వాటికి విచారించి సమాధి కట్టినట్లు, ఐదురోజుల ఆట, ఆటలో కళాత్మకత లకు ఎంత తొందర గా గోరీ కడితే, అంత ఆధునికవాదులవ్వచ్చు.

భవదీయుడు,

సీతారామం

Sunday 28 March 2010

విలువలు..

ఈ వారం కథలు ఏవి అంత గొప్ప గా లేవు. అంచేత, మనసు ఎందుకో న్యూస్ ని అనలైజ్ చేసే వైపు పరుగులు తీసింది. నిన్నో మొన్నో ఆంధ్రభూమి లో ఒక వార్త. 'వచ్చేదెవరు, పోయేదెవరు' అని. ప్రతిపాదిత (లేక ఊహాజనిత) మంత్రివర్గ మార్పులు.. అన్నది అంశం.

బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మంత్రులు కావడానికి అర్హత కులమేనా? భారత దేశం ఇంత కంటే బాగా ఆలోచించ లేదా? అని చాలా బాధ అనిపించింది. అక్కడ మొదలైన విచికిత్స పోయి పోయి అసలు ఎందువల్ల ఇలా అనేచోట ఆగింది.

మనుషుల ఆలోచనా సరళి లో మార్పే దీనికి కారణం అని తీర్మానించుకున్నాను. ఎలా అంటే..

50 ఏళ్ళ క్రితం, 80 ఏళ్ళ క్రితం, మనం ఇంత దారుణం గా ఉన్నామా? ఇంకా దిగాజారిపోతున్నామా? ఆ కాలపు సినిమాలు, కథలు, పత్రికలు, మహానుభావుల వ్యాసాలూ అన్నీ కూడా ఇంత దారుణం గా లేవు అని ఋజువు చేస్తున్నాయి. శ్రీ శ్రీ లాంటి కవులు 'అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు...' అని ప్రశ్నించినా, అప్పటికీ ఇప్పటికీ ఇంకా నీచము గా అయిపొయింది మన వ్యవస్థ.

చెడ్డ పని చెయ్యడమె కాక, పట్టుబడితే సిగ్గు కూడా పడడం మానేశారు ప్రజలు. అందులోంచే కొంత మంది రాజకీయ నాయకులు అయ్యారు కనక వేరే ఆశలు పెట్టుకోవడం అనవసరం.

ఇవాళ ఎవరైనా ప్రిన్సిపుల్స్ తోటి బతికితే వాళ్ళు చాదస్తులు అవుతున్నారు తప్ప గొర్రెల మంద మాత్రం నేర్చుకోవటల్లేదు. ఈ హేళన భరించలేని వాళ్ళు, లేదా ఇతరత్రా కారణాలు కనపడ్డ వారు, జ్ఞానం తెచ్చుకుని గొర్రెల మందలో కలిసిపోతున్నారు. గురువుని పూజింపుము, అని చిన్నప్పుడు చదువుకున్నాం. కనీసం మా ఇంట్లో, మాస్టారు చెప్పారు అనడమే తప్ప, ఏక వచన ప్రయోగం నాకు తెలిసి చెయ్యలేదు. అథవా, ఎవడైనా నా బోటి విప్లవ కారుడు చేసినా తోలు వలవబడేది. ఇవాళ, పిల్లలకి టీచర్లను ఏకవచన ప్రయోగం చెయ్యకూడదు అంటే జూ లో జంతువుని చూసినట్లు చూస్తున్నారు, అప్పుడు అలా చదువుకున్న వాళ్ళు కూడా. ఇలాంటివి కొన్ని వందల విషయాలు మనం రోజూ చూస్తున్నాం, కాని పట్టించుకోం. ఎందుకంటే, అంతే..

ఇంకో ఉదాహరణ. నాన్నో, అమ్మో, ఏదైనా చెపితే వినని చాలా మంది నవ తరం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తాత, నాయనమ్మ / అమ్మమ్మ ల నించి ఏదో నేర్చుకోలేక పోతున్నారని అమెరికా లోను, ఇంకా ఇతర ప్రవాస దేశాలలోను అంగలార్చడం నేను కళ్ళారా చూసి తరించాను.

ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోం, పట్టించుకునే ఖాళీ మనకు లేదు. కాని పేపరులో చూసి మాత్రం విచారిస్తాం, దేశం సర్వ నాశనం అయిపోయిందని ఉపన్యాసాలిస్తాం.

అందుచేత, మహానుభావులు చెప్పినట్లు, మార్పు మనలో మొదలవుతుంది. (ఇప్పుడూ అవుతోంది, ముందు చెప్పినట్టు గొర్రెల మంద వైపు) అయ్యా, అమ్మా, మీరు మారండి. విలువలు, ప్రిన్సిపుల్స్ పిల్లలకు అలవాటు చెయ్యండి. బహుశా భవిష్య నాయకగణమయినా ఇప్పటి తరం కంటే మంచి వాళ్ళు వస్తారని ఆశించవచ్చు. లేకపోతే, ఇలా కుక్కమూతి పిందెల నాయకత్వంలో దేశం భ్రస్టుపట్టి పోతుంది, విసుగెత్తిన మన పిల్లల తరాలు, స్వాతంత్ర్యాన్నే ప్రశ్నించే ప్రమాదం ఉంది.

Sunday 21 March 2010

వీకెండ్ కథలు

ఈ ఆదివారం (21/03/2010) చదివిన కథలు:
ఈనాడు - పునాది రాళ్ళు
ముందుగా కథ కంటే, ఇతివృత్తం నన్ను ఇబ్బంది పెట్టింది. మార్ఫింగ్ లాంటి పనులు జరిగే అవకాశం ఉన్నా అవి ఎంతో మందికి తెలియదు ఇంకా. అలాంటి కథావస్తువు తీసుకుని కథ వ్రాసి ఈనాడు లాంటి పెద్ద పత్రిక లో ప్రచురిస్తే, ఇప్పుడు అది తెలియనివారికి కూడా తెలుస్తుంది. అంతే తప్ప ఈ కథ వల్ల వేరే ఉపయోగం నాకేమీ కనపడలేదు. దినపత్రిక లాంటి శక్తివంతమైన మాధ్యమం లో ఇలాంటి కథలు, దానికి తగ్గ బొమ్మలు పూర్తి గా అనవసరం.
కథని విశ్లేషిస్తే, రచయిత స్త్రీ స్వాభిమానాన్ని సమర్ధించారు, బాగుంది. కాని ఎన్నుకున్న దారి చాలా పొరపాటు, నిజ జీవితానికి చాలా దూరంగా ఉన్న పరిష్కారం. నా దృష్టి లో ఇంకా చాలా చదివి అప్పుడు వ్రాయడం మొదలు పెడితే, కథ లో ఇతివృత్తము యొక్క ప్రాధాన్యత తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఇంకా మంచి రచయిత కాగలరు.

అంధ్ర భూమి - జీవన స్రవంతి
జీవన స్రవంతి కథ లో ఏదో చెయ్యాలనే కోరిక నిద్రాణంగా ఉన్న ఎందరో గృహిణులు కనబడతారు. కాకపోతే అందరి అప్ప్రోచ్ ఒకేలా ఉండదు. కాని రచయిత్రి చూపిన కోణం బావుంది. కాకపొతే, పిట్ట కథ లాంటి దానమ్మ, ఆమె కు సంబంధించిన అన్ని సన్నివేశాలు వృధా. అది అంతా తీసేస్తే, కథ చిన్నది అయినా, ఫోకస్డ్ గా ఉండేది. ఇంకా పరిణితి చూపిస్తే, మంచి రచనలు చెయ్యగలరు అని నా నమ్మకం.

అంధ్ర జ్యోతి - పరబ్రెహ్మం
ఈ కథ ని ఒక్క సారి చదివి ఒదిలేస్తే లాభం లేదు. ప్రతీ రోజు, ప్రతీ సారి, రైతుల కి జరిగే అన్యాయాలని చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోదగ్గది. అప్పుడే ఈ కథ కి సార్థకత. అంత సామాజిక స్పృహ ఉన్న కథ ఇది. కోడిగుడ్డు కి ఈకలు పీకినట్టు ఈ కథ లో పాత్రల న్యాయాలు చూడకుండా సారాంశాన్ని తీసుకుంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరూ తెలుసుకుంటారు. ఆకొన్న వారికి ఒక ముద్ద అన్నం పెడతారు. చాల మంచి ఇతివృత్తం. బాధించినా బాగున్న కథ ఇది.


ఇది నా తొలి అడుగు

పెద్దలకు నమస్కారములు,

నేను కొన్ని పుస్తకాలు చదివాను (నవలలు, కథలు, పోస్టులు, అన్ని రకాలుగా ప్రింట్ అయినవి). కొన్ని సార్లు నా భావాలను వ్యక్తీకరించాను బ్లాగులలో పోస్టింగ్ ల ద్వారా. మిత్రులు కొంతమంది రెచ్చగొట్టడం తో రెచ్చబడి (ఈ పద ప్రయోగం నా స్వంతం కాదు సుమా) ఈ ప్రయత్నం చేస్తున్నాను.

ఇప్పుడు ఒక బ్లాగ్ తయారు చేస్తున్నాను, నా విమర్శలను ఒక చోట ఉంచడానికి. అసలు విమర్శ అవసరం ఏమిటి? రచయిత దృక్కోణం నుంచి కాక మరో కొత్త కోణాన్ని చూడడమే విమర్శ తొలి లక్ష్యం. ఈ రంగంలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. వారి అడుగు జాడల లో కొన్ని అడుగులైనా వెయ్యలేక పోతానా అనే నమ్మకం తో ఈ బ్లాగు ని ప్రారంభించాను.

అందరి సలహాలు, సంప్రదింపుల కోసం ఎదురుచూస్తూ

బుధజన విధేయుడు

సీతారామం